John 6:1-71 OTSA
[1] ఈ సంగతులు జరిగిన కొంతకాలానికి, యేసు గలిలయ సముద్రాన్ని దాటి అవతలి తిబెరియ సముద్రతీరానికి వెళ్లారు. [2] అక్కడ ఆయన రోగులను స్వస్థపరచడం ద్వారా ఆయన చేసిన అసాధారణ సూచకక్రియలను చూసిన గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది. [3] అప్పుడు యేసు కొండ ఎక్కి తన శిష్యులతో పాటు అక్కడ కూర్చుని ఉన్నారు. [4] యూదుల పస్కా పండుగ సమీపించింది. [5] యేసు గొప్ప జనసమూహం తన దగ్గరకు రావడం చూసి ఫిలిప్పుతో, “ఈ ప్రజలు తినడానికి రొట్టెలను ఎక్కడ కొందాం?” అన్నారు. [6] తాను చేయబోయేది ఆయనకు ముందుగానే తెలుసు, కేవలం అతన్ని పరీక్షించడానికి మాత్రమే ఆయన అడిగారు. [7] ఫిలిప్పు ఆయనతో, “ఒక్కొక్కరికి ఒక్కో చిన్నముక్క ఇవ్వడానికి సరిపడే రొట్టెలను కొనాలంటే రెండువందల దేనారాల కంటే ఎక్కువవుతుంది” అని చెప్పాడు. [8] ఆయన శిష్యులలో మరొకడు, సీమోను పేతురు సోదరుడైన అంద్రెయ మాట్లాడుతూ, [9] “ఇక్కడ ఒక బాలుని దగ్గర అయిదు యవల రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్నాయి, కానీ ఇంత మందికి అవి ఎలా సరిపోతాయి?” అన్నాడు. [10] అప్పుడు యేసు, “ప్రజలను కూర్చోబెట్టండి” అని చెప్పారు. అక్కడ చాలా పచ్చిక ఉంది కాబట్టి, ప్రజలు కూర్చున్నారు. అక్కడ సుమారు అయిదు వేలమంది పురుషులు ఉన్నారు. [11] యేసు ఆ రొట్టెలను తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి అక్కడ కూర్చున్న వారికి కావలసినంత పంచిపెట్టారు. చేపలు కూడా అలాగే పంచిపెట్టారు. [12] వారందరూ సరిపడినంత తిన్న తర్వాత ఆయన తన శిష్యులతో, “ఏదీ వృధా కాకుండా మిగిలిన ముక్కలను పోగు చేయండి” అని చెప్పారు. [13] అందరు తిన్న తర్వాత మిగిలిన అయిదు యవల రొట్టె ముక్కలను పన్నెండు గంపలలో నింపారు. [14] యేసు చేసిన అద్భుత కార్యాన్ని చూసిన ప్రజలు, “నిజంగా ఈ లోకానికి రాబోయే ప్రవక్త ఈయనే” అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. [15] వారు తనను బలవంతంగా రాజును చేయాలని చూస్తున్నారని యేసు గ్రహించి తప్పించుకుని ఒంటరిగా కొండపైకి వెళ్లారు. [16] సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రతీరానికి వెళ్లి, [17] ఒక పడవ ఎక్కి ఆ సరస్సును దాటుతూ కపెర్నహూముకు వెళ్తున్నారు. అప్పటికే చీకటి పడింది కానీ యేసు వారిని ఇంకా చేరుకోలేదు. [18] బలమైన గాలి వీస్తూ అలల ఉధృతి పెరిగింది. [19] వారు సుమారు మూడు, నాలుగు మైళ్ళ దూరం ప్రయాణం చేసిన తర్వాత, యేసు నీటి మీద నడస్తూ పడవ దగ్గరకు రావడం చూసి వారు భయపడ్డారు. [20] అయితే ఆయన వారితో, “నేనే, భయపడకండి” అన్నారు. [21] అప్పుడు వారు ఆయనను పడవలోనికి ఎక్కించుకోడానికి ఒప్పుకున్న వెంటనే ఆ పడవ వారు వెళ్లవలసిన తీరాన్ని చేరింది. [22] తర్వాత రోజు సరస్సు అవతలి వైపు ఉన్న జనసమూహం అక్కడ ఒకే ఒక పడవ ఉండడం చూసి యేసు తన శిష్యులతో కలిసి పడవలో ఎక్కి వెళ్లలేదని కేవలం శిష్యులు మాత్రమే వెళ్లారని గ్రహించారు. [23] ప్రభువు కృతఙ్ఞతలు చెల్లించిన తర్వాత వారు రొట్టెలు తిన్న ప్రాంతానికి కొన్ని చిన్న పడవలు తిబెరియ నుండి వచ్చాయి. [24] ఆ పడవలలో వచ్చిన ఆ జనసమూహం యేసు ఆయన శిష్యులు అక్కడ లేరని గ్రహించి మళ్ళీ పడవలు ఎక్కి యేసును వెదుకుతూ కపెర్నహూముకు వెళ్లారు. [25] వారు ఆయనను సరస్సు అవతలి ఒడ్డున చూసినప్పుడు, “రబ్బీ, నీవు ఇక్కడకు ఎప్పుడు వచ్చావు?” అని వారు ఆయనను అడిగారు. [26] అందుకు యేసు వారితో, “మీరు రొట్టెలు తిని తృప్తి పొందారు కాబట్టి నన్ను వెదుకుతున్నారు తప్ప నేను చేసిన అద్భుత కార్యాలను చూసినందుకు కాదని నేను మీతో చెప్పేది నిజము. [27] మీరు పాడైపోయే ఆహారం కోసం కష్టపడకండి కానీ మనుష్యకుమారుడు మీకిచ్చే నిరంతరం నిలిచి ఉండే ఆహారం కోసం కష్టపడండి. ఎందుకంటే తండ్రియైన దేవుడు దానిని మీకు ఇవ్వడానికే ఆయనపై తన ఆమోద ముద్ర వేశారు” అని చెప్పారు. [28] అప్పుడు వారు ఆయనను, “దేవుని పనులను చేయడానికి మేమేమి చేయాలి?” అని అడిగారు. [29] అందుకు యేసు, “ఆయన పంపినవానిని నమ్మడమే దేవుని పని” అని చెప్పారు. [30] కాబట్టి వారు, “మేము చూసి నిన్ను నమ్మడానికి నీవు ఏ అద్భుత కార్యాన్ని చేస్తున్నావు? ఏమి చేస్తావు? [31] మన పితరులు అరణ్యంలో మన్నాను తిన్నారని, ‘తినడానికి వారికి పరలోకం నుండి ఆహారం ఇచ్చారు’ అని వ్రాయబడి ఉంది కదా!” అని ఆయనను అడిగారు. [32] యేసు వారితో, “నేను మీతో ఖచ్చితంగా చెప్పుతున్నాను, మీకు పరలోకం నుండి ఆహారం ఇచ్చింది మోషే కాదు, పరలోకం నుండి నా తండ్రే నిజమైన ఆహారం మీకిస్తారు. [33] ఎందుకంటే పరలోకం నుండి దిగి వచ్చి లోకానికి జీవం ఇచ్చేది దేవుడు ఇచ్చే ఆహారమని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని చెప్పారు. [34] అందుకు వారు, “అయ్యా, ఈ ఆహారం మాకు ఎల్లప్పుడు ఇవ్వు” అన్నారు. [35] అప్పుడు యేసు వారితో ఇట్లన్నాడు: “జీవాహారం నేనే. నా దగ్గరకు వచ్చే వారికి ఎప్పుడు ఆకలివేయదు, నన్ను నమ్మేవారికి ఎప్పుడు దాహం వేయదు. [36] అయితే నేను మీకు చెప్పిన రీతిగానే మీరు నన్ను చూసి కూడా నమ్మలేదు. [37] తండ్రి నాకు ఇచ్చే వారందరు నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చేవారిని నేను ఎప్పుడు త్రోసివేయను. [38] ఎందుకంటే నేను నాకిష్టమైనది చేయడానికి పరలోకం నుండి దిగిరాలేదు కానీ నన్ను పంపినవానికి ఇష్టమైనది చేయడానికే వచ్చాను. [39] ఆయన నాకిచ్చిన వారిలో ఎవరినీ పోగొట్టుకోకుండా, చివరి రోజున వారిని జీవంతో లేపడం నన్ను పంపినవాని చిత్తమై ఉంది. [40] కుమారుని చూసి ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరు నిత్యజీవాన్ని పొందాలనేది నా తండ్రి చిత్తమై ఉంది. వారిని చివరి రోజున జీవంతో నేను లేపుతాను.” [41] “పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే” అని ఆయన చెప్పినందుకు యూదులు ఆయనపై సణుగుకోవడం మొదలుపెట్టారు. [42] వారు, “ఈ యేసు యోసేపు కుమారుడు కాడా? ఇతని తల్లిదండ్రులు మనకు తెలియదా? ‘నేను పరలోకం నుండి దిగి వచ్చాను’ అని ఎలా చెప్తున్నాడు?” అని చెప్పుకున్నారు. [43] యేసు, “మీలో మీరు సణుగుకోవడం ఆపండి” అన్నారు. [44] ఇంకా మాట్లాడుతూ, “నన్ను పంపిన తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవరూ నా దగ్గరకు రాలేరు, చివరి రోజున నేను వారిని జీవంతో లేపుతాను. [45] ‘దేవుడు వారందరికి బోధిస్తారు’ అని ప్రవక్తలచే వ్రాయబడిన విధంగా, తండ్రి మాటలను విని ఆయన నుండి నేర్చుకున్న ప్రతిఒక్కరు నా దగ్గరకు వస్తారు. [46] దేవుని నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవరు తండ్రిని చూడలేదు; ఆయన మాత్రమే తండ్రిని చూశారు [47] నమ్మినవారే నిత్యజీవాన్ని కలిగి ఉంటాడని నేను మీతో చెప్పేది నిజము. [48] జీవాహారం నేనే. [49] మీ పితరులు అరణ్యంలో మన్నాను తిని కూడా చనిపోయారు. [50] అయితే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇక్కడ ఉంది. దీన్ని తినే వారెవరు చనిపోరు. [51] పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఈ ఆహారం ఎవరు తింటారో వారు నిరంతరం జీవిస్తారు. ఈ లోకాన్ని జీవింపచేసే ఈ జీవాహారం నా శరీరమే” అని చెప్పారు. [52] అందుకని యూదులు తమలో తాము, “ఈయన తన శరీరాన్ని మనం తినడానికి ఎలా ఇవ్వగలడు?” అని తీవ్రంగా వాదించుకోవడం మొదలుపెట్టారు. [53] అందుకు యేసు వారితో, “నేను మీతో చెప్పేది నిజం, మీరు మనుష్యకుమారుని శరీరాన్ని తిని, ఆయన రక్తాన్ని త్రాగితేనే తప్ప మీలో జీవం ఉండదు. [54] నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగినవారు నిత్యజీవం కలిగి ఉంటారు. చివరి రోజున నేను వానిని జీవంతో లేపుతాను. [55] నా శరీరం నిజమైన ఆహారం నా రక్తం నిజమైన పానీయము. [56] నా శరీరాన్ని తిని, నా రక్తాన్ని త్రాగినవారు నాలో నిలిచి ఉంటారు, అలాగే నేను వారిలో నిలిచి ఉంటాను. [57] సజీవుడైన తండ్రి నన్ను పంపినందుకు నేను తండ్రి వలననే జీవిస్తున్నాను. అలాగే నన్ను తినేవారు నా వలన జీవిస్తారు. [58] పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం ఇదే. మీ పితరులు మన్నాను తిని చనిపోయారు కాని ఈ ఆహారం ఎవరు తింటారో వారు నిరంతరం జీవిస్తారు” అని చెప్పారు. [59] కపెర్నహూములోని సమాజమందిరంలో బోధిస్తూ యేసు ఈ మాటలను చెప్పారు. [60] అది విన్న ఆయన శిష్యులలో అనేకమంది, “ఇది కష్టమైన బోధ, ఎవరు దీనిని అంగీకరిస్తారు?” అన్నారు. [61] యేసు తన శిష్యులు దీని గురించి సణుగుకుంటున్నారని గ్రహించి వారితో, “ఈ మాటలు మీకు అభ్యంతరకరంగా ఉన్నాయా? [62] అయితే మనుష్యకుమారుడు తాను ఇంతకుముందు ఉన్న చోటికే ఎక్కిపోవడం చూస్తే ఏమంటారు? [63] ఆత్మ జీవాన్ని ఇస్తుంది; శరీరం వలన ప్రయోజనం లేదు. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మతో జీవంతో నిండి ఉన్నాయి. [64] అయినా మీలో కొందరు నమ్మడం లేదు” అన్నారు. ఎందుకంటే వారిలో ఎవరు మొదటి నుండి నమ్మడం లేదో, ఎవరు తనను అప్పగిస్తారో యేసుకు తెలుసు. [65] ఆయన వారితో, “ఈ కారణంగానే తండ్రి రానిస్తేనే తప్ప మరి ఎవరు నా దగ్గరకు రాలేరని నేను మీతో చెప్తున్నాను” అన్నారు. [66] అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకమంది వెనక్కి వెళ్లిపోయి మరి ఎన్నడు ఆయనను వెంబడించలేదు. [67] యేసు పన్నెండుమందిని, “మీరు కూడా వెళ్లాలనుకుంటున్నారా?” అని అడిగారు. [68] అందుకు సీమోను పేతురు ఆయనతో, “ప్రభువా, మేము ఎవరి దగ్గరకు వెళ్లాలి? నిత్యజీవపు మాటలను నీ దగ్గరే ఉన్నాయి. [69] నీవే దేవుని పరిశుద్ధుడవని మేము నమ్మి తెలుసుకున్నాము” అని చెప్పాడు. [70] అప్పుడు యేసు, “మీ పన్నెండుమందిని నేను ఎన్నుకోలేదా? అయినా మీలో ఒకడు దుష్టుడు” అని వారితో చెప్పారు. [71] పన్నెండుమందిలో ఒకనిగా ఉన్నా తర్వాత ఆయనను అప్పగించబోయే సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా గురించి ఆయన చెప్పారు.
