John 4:1-54 OTSA
[1] యోహాను కంటే యేసు ఎక్కువమందిని శిష్యులుగా చేసుకుని బాప్తిస్మం ఇస్తున్నట్లు పరిసయ్యులు విన్నారని యేసుకు తెలిసింది. [2] నిజానికి బాప్తిస్మం ఇచ్చింది యేసు కాదు ఆయన శిష్యులు ఇస్తున్నారు. [3] కాబట్టి ఆయన యూదయ ప్రాంతాన్ని విడిచి మరొకసారి గలిలయ ప్రాంతానికి తిరిగి వెళ్లారు. [4] ఆయన సమరయ ప్రాంతం గుండా వెళ్లవలసివచ్చింది. [5] కాబట్టి యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఇచ్చిన భూమి దగ్గరగా ఉన్న సమరయలోని సుఖారనే ఊరికి ఆయన వచ్చారు. [6] అక్కడ యాకోబు బావి ఉంది. యేసు ప్రయాణం చేసి అలసిపోయి ఆ బావి ప్రక్క కూర్చున్నారు. అది మిట్టమధ్యాహ్న సమయము. [7] ఒక సమరయ స్త్రీ నీరు తోడుకోడానికి అక్కడికి వచ్చినప్పుడు యేసు ఆమెతో, “నాకు త్రాగడానికి నీళ్లు ఇవ్వగలవా?” అని అడిగారు. ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోనికి వెళ్లారు. [9] ఆ సమరయ స్త్రీ ఆయనతో, “నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని. నీవు నన్ను త్రాగడానికి ఇవ్వమని ఎలా అడుగుతావు?” అన్నది. ఎందుకంటే యూదులు సమరయులతో సహవాసం చేయరు. [10] యేసు, “నీవు దేవుని బహుమానం గురించి, నిన్ను నీళ్లు అడుగుతున్న వ్యక్తి గురించి తెలుసుకుంటే నీవే ఆయనను అడిగేదానివి. ఆయన నీకు జీవజలాన్ని ఇచ్చి ఉండేవాడు” అని ఆమెకు జవాబిచ్చారు. [11] అందుకు ఆమె, “అయ్యా, ఈ బావి చాలా లోతైనది. పైగా నీళ్లు తోడుకోడానికి నీ దగ్గర ఏమి లేదు. మరి ఆ జీవజలం నీకు ఎక్కడ దొరుకుతుంది? [12] మా పితరుడైన యాకోబు ఈ బావిని మాకిచ్చాడు. ఈ బావి నీళ్లను అతడు, అతని కుమారులు త్రాగారు; అతని పశువులు కూడా త్రాగాయి. నీవు అతనికంటే గొప్పవాడివా?” అని అడిగింది. [13] అందుకు యేసు, “ఈ నీళ్లు త్రాగిన వారందరికి మళ్ళీ దాహం వేస్తుంది. [14] కానీ నేనిచ్చే నీళ్లు త్రాగే వారికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. నిజానికి, నేనిచ్చే నీళ్లు వారిలో నిత్యజీవానికి నీటి ఊటగా ఉంటుంది” అన్నారు. [15] ఆ స్త్రీ ఆయనతో, “అయ్యా, నాకు దాహం వేయకుండా, నీళ్లు చేదుకోడానికి ఇంత దూరం రానవసరం లేకుండ ఆ నీటిని నాకు ఇవ్వండి” అన్నది. [16] ఆయన ఆమెతో, “వెళ్లి, నీ భర్తను పిలుచుకొనిరా” అని చెప్పారు. [17] అందుకు ఆమె, “నాకు భర్త లేడు” అన్నది. యేసు ఆమెతో, “నీకు భర్త లేడని నీవు చెప్పింది వాస్తవమే. [18] నిజానికి, నీకు అయిదుగురు భర్తలు ఉండేవారు. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. నీవు సత్యమే చెప్పావు” అన్నారు. [19] అప్పుడు ఆ స్త్రీ, “అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను. [20] మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు, కానీ యూదులైన మీరు ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందని అంటారు” అన్నది. [21] అప్పుడు యేసు ఆమెతో, “అమ్మా, నన్ను నమ్ము. ఒక సమయం వస్తుంది అప్పుడు మీరు తండ్రిని ఈ పర్వతం మీద గాని యెరూషలేములో గాని ఆరాధించరు. [22] సమరయులైన మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు; మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం, ఎందుకంటే రక్షణ యూదులలో నుండే వస్తుంది. [23] అయినా నిజమైన ఆరాధికులు పరలోక తండ్రిని ఆత్మతో, సత్యంతో ఆరాధించే ఒక సమయం వస్తుంది. అది ఇప్పటికే వచ్చేసింది. ఎందుకంటే అలాంటి ఆరాధికుల కోసమే తండ్రి చూస్తున్నారు. [24] దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి” అని చెప్పారు. [25] అప్పుడు ఆ స్త్రీ ఆయనతో, “క్రీస్తు వస్తాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు అన్ని విషయాలను మాకు వివరిస్తాడు” అని అన్నది. [26] అప్పుడు యేసు, “నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను” అని చెప్పారు. [27] ఇంతలో ఆయన శిష్యులు అక్కడికి వచ్చి యేసు ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉండడం చూసి ఆశ్చర్యపడ్డారు. కానీ, “నీకు ఏమి కావాలి? అని గాని, ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు?” అని గాని ఎవరు అడగలేదు. [28] అప్పుడు ఆ స్త్రీ తన నీటి కుండను అక్కడే వదిలిపెట్టి ఊరిలోనికి వెళ్లి ప్రజలతో, [29] “రండి, నేను చేసిందంతా నాతో చెప్పిన ఆయనను చూడండి, ఈయనే క్రీస్తు కాడా?” అని చెప్పింది. [30] వారు ఊరి నుండి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చారు. [31] ఇంతలో ఆయన శిష్యులు, “రబ్బీ, కొంచెం తినండి” అని ఆయనను వేడుకున్నారు. [32] అయితే ఆయన, “తినడానికి మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది” అని వారితో చెప్పారు. [33] అందుకు శిష్యులు ఒకరితో ఒకరు, “ఎవరైనా ఈయనకు ఆహారం తెచ్చారేమో?” అని చెప్పుకున్నారు. [34] యేసు వారితో, “నన్ను పంపినవాని చిత్తప్రకారం చేసి ఆయన పనిని ముగించడమే నా ఆహారము. [35] ‘కోతకు రావడానికి ఇంకా నాలుగు నెలలు ఉంది’ అని మీరు చెప్పుతారు కదా! నేను మీతో చెప్పేది ఏంటంటే, కళ్లు తెరిచి పొలాలను చూడండి! పంట పండి కోతకు సిద్ధంగా ఉంది. [36] విత్తినవాడు కోసేవాడు ఇద్దరూ సంతోషించేలా, పంటను కోసేవాడు తన జీతం తీసుకుని పంట అంతా కోసి నిత్యజీవం కోసం కూర్చుకుంటాడు. [37] ఈ విషయంలో ‘విత్తువాడు ఒకడు, కోసేవాడు మరొకడు’ అనే సామెత నిజమే. [38] మీరు పని చేయని పొలంలో పంటను కోయడానికి నేను మిమ్మల్ని పంపించాను. అక్కడ ఇతరులు కష్టపడి పని చేశారు. వారి కష్ట ఫలాన్ని మీరు కోసుకొని అనుభవిస్తున్నారు” అన్నారు. [39] ఆ ఊరిలోని సమరయులలో అనేకమంది, “నేను చేసిందంతా నాతో చెప్పారు” అని ఆ స్త్రీ ఆయనను గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆయనను నమ్మారు. [40] ఆ సమరయులు ఆయన దగ్గరకు వచ్చి తమతో ఉండమని వేడుకున్నప్పుడు ఆయన అక్కడ రెండు రోజులు ఉన్నారు. [41] ఆయన మాటలు విని ఇంకా చాలామంది విశ్వాసులయ్యారు. [42] వారు ఆ స్త్రీతో, “నీవు చెప్పిన దానిని బట్టి కాదు; కాని మాకు మేమే విని నిజంగా ఈయన లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముతున్నాం” అన్నారు. [43] రెండు రోజుల తర్వాత ఆయన గలిలయ ప్రాంతానికి వెళ్లారు. [44] ఒక ప్రవక్త తన స్వదేశంలో గౌరవం పొందడని యేసే స్వయంగా సాక్ష్యమిచ్చారు. [45] ఆయన గలిలయకు చేరగానే గలిలయులు ఆయనను ఆహ్వానించారు. పస్కా పండుగ సమయంలో వారందరు అక్కడే ఉన్నారు కాబట్టి యెరూషలేములో ఆయన చేసిన కార్యాలన్నిటిని వారు చూశారు. [46] ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చిన గలిలయలోని కానాకు మరలా వచ్చారు. కపెర్నహూములో ఒక రాజ్యాధికారి కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు. [47] యేసు యూదయ ప్రాంతం నుండి గలిలయకు వచ్చాడని ఆ రాజ్యాధికారి విని ఆయన దగ్గరకు వెళ్లి, చనిపోతున్న తన కుమారుని స్వస్థపరచుమని బ్రతిమాలుకున్నాడు. [48] యేసు అతనితో, “మీరు అద్భుతకార్యాలు, మహత్కార్యాలను చూస్తేనే తప్ప నమ్మరు” అన్నారు. [49] ఆ రాజ్యాధికారి, “అయ్యా, నా బిడ్డ చనిపోకముందే దయచేసి రండి” అని వేడుకున్నాడు. [50] యేసు, “వెళ్లు, నీ కుమారుడు బ్రతుకుతాడు” అని చెప్పారు. యేసు మాటను నమ్మి అతడు వెళ్లిపోయాడు. [51] అతడు ఇంకా దారిలో ఉండగానే, అతని పనివారు అతన్ని కలిసి అతని కుమారుడు బాగయ్యాడని చెప్పారు. [52] అతడు తన కుమారుడు ఏ సమయంలో బాగుపడ్డాడని వారిని అడిగినప్పుడు, “నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు అతని జ్వరం తగ్గిపోయింది” అని వారు చెప్పారు. [53] అప్పుడు ఆ తండ్రి యేసు తనతో, “నీ కుమారుడు బ్రతుకుతాడు” అని సరిగ్గా అదే సమయంలో చెప్పారని గ్రహించి అతడు, అతని ఇంటివారందరు నమ్మారు. [54] యేసు యూదయ ప్రాంతం నుండి గలిలయకు వచ్చిన తర్వాత ఆయన చేసిన రెండవ సూచకక్రియ ఇది.
