John 2:1-25 OTSA
[1] మూడవ రోజున గలిలయ ప్రాంతంలోని కానా అనే ఊరిలో ఒక పెళ్ళి జరిగింది. యేసు తల్లి అక్కడ ఉంది. [2] యేసు, ఆయన శిష్యులు ఆ పెళ్ళికి ఆహ్వానించబడ్డారు. [3] అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు, యేసు తల్లి ఆయనతో, “ద్రాక్షరసం అయిపోయింది” అని చెప్పింది. [4] అందుకు యేసు, “అమ్మా, దాంతో మనకేంటి? నా సమయం ఇంకా రాలేదు” అన్నారు. [5] ఆయన తల్లి పరిచారకులతో, “ఆయన మీతో చెప్పేది చేయండి” అని చెప్పింది. [6] అక్కడ ఆరు రాతి నీటి బానలు ఉన్నాయి, యూదులు శుద్ధీకరణ ఆచారం కోసం వాటిని వాడుతారు. ఒక్కొక్క దానిలో వంద లీటర్ల నీళ్లు పడతాయి. [7] యేసు, “ఆ బానలను నీటితో నింపండి” అని చెప్పారు; కాబట్టి ఆ పనివారు వాటిని అంచుల వరకు నింపారు. [8] ఆయన వారితో, “ఇప్పుడు అందులో నుండి ముంచి తీసుకెళ్లి విందు ప్రధానికి ఇవ్వండి” అని చెప్పారు. వారు ఆ విధంగా చేసినప్పుడు, [9] ఆ విందు ప్రధాని ద్రాక్షరసంగా మారిన ఆ నీటిని రుచి చూశాడు. ఆ నీటిని తెచ్చిన పనివారికి తప్ప అది ఎక్కడ నుండి వచ్చిందో అతనికి తెలియలేదు. కాబట్టి అతడు పెండ్లికుమారుని ప్రక్కకు పిలిచి, [10] “అందరు మొదట మంచి ద్రాక్షరసాన్ని పోసి, అతిథులు త్రాగలేని స్థితిలో ఉన్నప్పుడు చౌక ద్రాక్షరసాన్ని పోస్తారు, కాని నీవైతే ఇప్పటివరకు మంచి ద్రాక్షరసాన్నే ఉంచావు” అన్నాడు. [11] గలిలయ ప్రాంతపు కానాలో యేసు ఈ మొదటి అద్భుతం చేసి తన మహిమను తెలియజేశారు. దీని వలన ఆయన శిష్యులు ఆయనను నమ్మారు. [12] దీని తర్వాత యేసు తన తల్లి, తన సహోదరులు, తన శిష్యులతో కలిసి కపెర్నహూముకు వెళ్లారు. వారు కొన్ని రోజులు అక్కడ ఉన్నారు. [13] యూదుల పస్కా పండుగ దగ్గర పడినప్పుడు యేసు యెరూషలేముకు వెళ్లారు. [14] దేవాలయ ఆవరణంలో కొందరు ఎడ్లను, గొర్రెలను, పావురాలను అమ్మడం, మరికొందరు పరదేశి డబ్బులు మార్చే బల్లల దగ్గర కూర్చుని ఉండడం ఆయన చూశారు. [15] ఆయన త్రాళ్లతో ఒక కొరడాను చేసి గొర్రెలను ఎడ్లను అన్నిటిని దేవాలయ ఆవరణంలో నుండి బయటకు తోలివేసి, డబ్బు మార్చే వారి నాణాలను చెల్లాచెదురు చేసి వారి బల్లలను పడవేశారు. [16] పావురాలను అమ్మేవారితో, “వీటిని ఇక్కడినుండి తీసివేయండి! నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా మార్చడం మానేయండి!” అన్నారు. [17] “నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను తినేస్తుంది” అని వ్రాయబడి ఉన్నదని శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. [18] అప్పుడు యూదులు, “ఇదంతా చేయడానికి నీకు అధికారం ఉన్నదని నిరూపించడానికి మాకు ఏ సూచనను చూపిస్తావు?” అని ఆయనను అడిగారు. [19] యేసు, “ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను మూడు రోజుల్లో దానిని తిరిగి లేపుతాను” అని వారికి జవాబిచ్చారు. [20] దానికి వారు, “ఈ దేవాలయాన్ని కట్టడానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. నీవు మూడు దినాల్లో దానిని తిరిగి లేపుతావా?” అని అడిగారు. [21] అయితే ఆయన తన శరీరమనే దేవాలయం గురించి చెప్పారు. [22] ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత, ఆయన శిష్యులు ఆయన చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నారు. వారు లేఖనాలను, యేసు చెప్పిన మాటలను నమ్మారు. [23] పస్కా పండుగ సమయంలో ఆయన యెరూషలేములో ఉన్నప్పుడు, ఆయన చేస్తున్న అద్భుత కార్యాలను చూసిన చాలామంది ఆయన పేరును నమ్మారు. [24] అయితే యేసుకు ప్రజలందరి గురించి తెలుసు కాబట్టి, ఆయన తనను తాను వారికి అప్పగించుకోలేదు. [25] ప్రతి ఒక్కరి అంతరంగం ఏమిటో ఆయనకు తెలుసు, కాబట్టి మానవుల గురించి ఎవరూ ఆయనకు సాక్ష్యమిచ్చే అవసరం లేదు.
