John 16:1-33 OTSA
[1] “మీరు విశ్వాసం నుండి తొలగిపోకూడదని నేను మీకు ఈ సంగతులను చెప్పాను. [2] వారు మిమ్మల్ని సమాజమందిరంలో నుండి వెలివేస్తారు; నిజానికి, మిమ్మల్ని చంపినవారు దేవుని కోసం మంచి పని చేస్తున్నామని భావించే ఒక సమయం వస్తుంది. [3] వారు నన్ను గాని, తండ్రిని గాని తెలుసుకోలేదు కాబట్టి వారు ఇలాంటి పనులను చేస్తారు. [4] అవి జరిగేటప్పుడు ఇలా జరుగుతుందని నేను మిమ్మల్ని ముందుగానే హెచ్చరించానని మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు చెప్పాను. మొదట్లో ఈ సంగతులను మీతో చెప్పలేదు ఎందుకంటే అప్పుడు నేను మీతోనే ఉన్నాను. [5] ఇప్పుడు నేను నన్ను పంపినవాని దగ్గరకు వెళ్తున్నాను. అయినా, ‘నీవు ఎక్కడికి వెళ్తున్నావు?’ అని మీలో ఎవ్వరూ నన్ను అడగడం లేదు. [6] కానీ నేను చెప్పిన ఈ సంగతులను గురించి మీ హృదయాలు దుఖంతో నిండి ఉన్నాయి. [7] అయితే నేను మీతో చెప్పేది నిజం, నేను వెళ్లిపోవడం మీకు మంచిది, ఎందుకంటే నేను వెళ్లకుండా ఆదరణకర్త మీ దగ్గరికి రారు. నేను వెళ్తే ఆయనను మీ దగ్గరికి పంపిస్తాను. [8] ఆయన వచ్చినప్పుడు, పాపం గురించి నీతిని గురించి తీర్పును గురించి లోకస్తులను తప్పు ఒప్పుకునేలా చేస్తాడు. [9] ప్రజలు నన్ను నమ్మలేదు కాబట్టి వారి పాపం గురించి, నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను కాబట్టి ఇక మీరు నన్ను చూడరు కాబట్టి వారి నీతిని గురించి, [11] ఈ లోకాధికారి ఇప్పుడు తీర్పుపొందినవానిగా ఉన్నాడు కాబట్టి తీర్పు గురించి ఒప్పింపజేస్తాడు. [12] “మీతో ఇంకా చాలా చెప్పాల్సి ఉంది, కాని మీరు ఇప్పుడు వాటిని భరించలేరు. [13] అయితే సత్యమైన ఆత్మ వచ్చినప్పుడు, ఆయన మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తాను మాట్లాడడు; తాను విన్నవాటినే ఆయన చెప్తాడు, జరుగబోయే వాటిని మీకు చెప్తాడు. [14] ఆయన నా నుండి వినే వాటినే మీకు తెలియచేస్తూ నన్ను మహిమపరుస్తాడు. [15] నా తండ్రికి ఉన్నవన్నీ నావే. అందుకే ఆత్మ నా నుండి వినే వాటినే మీకు తెలియజేస్తాడని నేను చెప్పాను.” [16] యేసు ఇంకా చెప్తూ, “ఇంకా కొద్ది సమయం తర్వాత మీరు నన్ను చూడరు, ఆ తర్వాత మరికొద్ది సమయానికి మీరు నన్ను చూస్తారు.” [17] అప్పుడు ఆయన శిష్యులలో కొందరు ఒకరితో ఒకరు, “ఆయన చెప్తున్న, ‘నేను నా తండ్రి దగ్గరకు వెళ్తున్నాను’ కాబట్టి ‘కొద్ది కాలం మీరు నన్ను చూడరు. ఆ తర్వాత కొంతకాలానికి మీరు నన్ను చూస్తారు’ అనే మాటలకు అర్థం ఏమైయుంటుంది?” అని చెప్పుకొన్నారు. [18] వారు, “ ‘ఇంకా కొద్ది సమయం’ అంటే ఆయన అర్థమేంటి? ఆయన ఏమి చెప్తున్నారో మనకు అర్థం కావడం లేదు” అని అనుకున్నారు. [19] యేసు తన శిష్యులు ఆ విషయం గురించి తనను అడగాలని అనుకుంటున్నారని గ్రహించి వారితో, “ఇంకా కొద్ది సమయం తర్వాత మీరు నన్ను చూడరు, దాని తర్వాత ఇంకొద్ది సమయానికి మీరు నన్ను చూస్తారు” అని నేను చెప్పినదాని గురించి మీరు ఒకరిని ఒకరు అడుగుతున్నారా? [20] నేను మీతో చెప్పేది నిజం, మీరు ఏడుస్తూ దుఃఖిస్తున్న సమయంలో ఈ లోక ప్రజలు సంతోషిస్తారు. మీకు దుఃఖం కలుగుతుంది, కాని మీ దుఃఖం సంతోషంగా మారుతుంది. [21] ఒక స్త్రీ ప్రసవించు సమయం వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడుతుంది; కానీ శిశువు పుట్టగానే తన ద్వారా ఈ లోకానికి ఒక బిడ్డ పుట్టాడనే ఆనందంలో తాను పడిన వేదనంతా ఆమె మరచిపోతుంది. [22] మీ విషయంలో కూడా అంతే; మీకు ఇది దుఃఖ సమయం, కాని నేను తిరిగి మిమ్మల్ని చూసినప్పుడు మీ హృదయాంతరంగంలో నుండి ఆనందిస్తారు. ఆ ఆనందాన్ని మీ దగ్గర నుండి ఎవ్వరూ తీసివేయలేరు. [23] ఆ రోజు మీరు ఇక నన్ను దేని గురించి అడగరు. మీరు నా పేరట నా తండ్రిని ఏమి అడిగినా అది మీకు ఇస్తారని నేను మీతో చెప్పేది నిజం. [24] ఇప్పటివరకు మీరు నా పేరట ఏమి అడగలేదు. అడగండి మీరు పొందుకొంటారు, మీ ఆనందం పరిపూర్ణమవుతుంది. [25] “ఇంతవరకు నేను మీతో ఉపమానాలతో చెప్పాను. కానీ ఒక సమయం వస్తుంది అప్పుడు నా తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియజేస్తాను. [26] ఆ రోజు మీరు నా పేరిట అడుగుతారు. అయితే మీ కోసం నేను తండ్రిని అడుగుతానని చెప్పడం లేదు. [27] ఎందుకంటే మీరు నన్ను ప్రేమించి, నేను దేవుని దగ్గరి నుండి వచ్చానని నమ్మారు కాబట్టి తండ్రి తానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. [28] నేను తండ్రి దగ్గరి నుండి బయలుదేరి ఈ లోకానికి వచ్చాను; ఇప్పుడు నేను లోకాన్ని విడిచి తండ్రి దగ్గరకు తిరిగి వెళ్తున్నాను” అన్నారు. [29] అప్పుడు యేసు శిష్యులు, “ఇప్పుడు నీవు ఉపమానాలతో కాకుండా స్పష్టంగా మాట్లాడుతున్నావు. [30] నీకు అన్ని సంగతులు తెలుసని, ఎవరు నిన్ను ప్రశ్నించే అవసరం లేదని మేము గ్రహిస్తున్నాము. దీనిని బట్టి నీవు దేవుని నుండి వచ్చావని మేము నమ్ముతున్నాం” అన్నారు. [31] యేసు వారితో, “ఇప్పుడు మీరు నమ్ముతున్నారా?” అన్నారు. [32] “ఒక సమయం రాబోతుంది, అది ఇప్పటికే వచ్చేసింది అప్పుడు మీలో ప్రతి ఒక్కరు నన్ను ఒంటరిగా విడిచి, ఎవరి ఇంటికి వారు చెదరిపోతారు. అయినాసరే నేను ఒంటరి వానిని కాను, ఎందుకంటే నా తండ్రి నాతో ఉన్నాడు. [33] “ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి. అయినా ధైర్యం తెచ్చుకోండి! ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. నాలో మీకు సమాధానం ఉండాలని ఈ సంగతులను మీకు చెప్పాను” అన్నారు.
