John 11:1-57 OTSA
[1] బేతనియ గ్రామానికి చెందిన మరియ, మార్తల సహోదరుడైన లాజరు అనారోగ్యంతో ఉన్నాడు. [2] అనారోగ్యంతో ఉన్న లాజరు సహోదరియైన మరియ ఈమెనే ప్రభువు పాదాల మీద పరిమళద్రవ్యాన్ని పోసి తన తలవెంట్రుకలతో తుడిచింది. [3] కాబట్టి అతని సహోదరీలు, “ప్రభువా, నీవు ప్రేమించినవాడు అనారోగ్యంగా ఉన్నాడు” అని కబురు పంపించారు. [4] యేసు అది విని, “ఈ అనారోగ్యం చావు కోసం వచ్చింది కాదు. దేవుని కుమారునికి మహిమ కలిగేలా దేవుని మహిమ పరచడానికే వచ్చింది” అని అన్నారు. [5] యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించారు. [6] లాజరు అనారోగ్యంతో ఉన్నాడని యేసు విని కూడా తాను ఉన్న చోటే మరో రెండు రోజులు ఉన్నారు. [7] ఆ తర్వాత ఆయన తన శిష్యులతో, “యూదయ ప్రాంతానికి వెళ్దాం రండి” అని అన్నారు. [8] అందుకు శిష్యులు, “రబ్బీ, ఇంతకుముందే యూదులు నిన్ను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారు కదా, అయినా నీవు అక్కడికి మళ్ళీ వెళ్తావా?” అని అడిగారు. [9] అందుకు యేసు, “పగలుకు పన్నెండు గంటలు ఉన్నాయి కదా? పగలు నడిచేవాడు తడబడకుండా నడుస్తాడు ఎందుకంటే అతడు లోకపు వెలుగులో చూడగలడు. [10] అతడు రాత్రివేళ నడిస్తే వెలుగు ఉండదు కాబట్టి అతడు తడబడతాడు” అని చెప్పారు. [11] యేసు ఈ సంగతులు వారితో చెప్పిన తర్వాత ఆయన ఇంకా వారితో, “మన స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు. కాబట్టి నేను అతన్ని లేపడానికి వెళ్తున్నాను” అని అన్నారు. [12] అందుకు ఆయన శిష్యులు ఆయనతో, “ప్రభువా, అతడు నిద్రపోతే బాగవుతాడు” అన్నారు. [13] యేసు అతని చావు గురించి మాట్లాడారు. కాని వారు సాధారణమైన నిద్ర గురించి అనుకున్నారు. [14] కాబట్టి యేసు వారితో స్పష్టంగా, “లాజరు చనిపోయాడు. [15] అప్పుడు నేను అక్కడ లేనందుకు మీ గురించి సంతోషిస్తున్నాను. దీన్ని బట్టి మీరు నమ్ముతారు. పదండి అతని దగ్గరకు వెళ్దాం” అన్నారు. [16] అప్పుడు దిదుమ అని పిలువబడే తోమా, “ఆయనతో పాటు చనిపోవడానికి ‘మనం కూడ వెళ్దాం రండి’ ” అని తోటి శిష్యులతో అన్నాడు. [17] యేసు అక్కడికి చేరుకుని, లాజరు శవాన్ని సమాధిలో ఉంచి అప్పటికే నాలుగు రోజులు గడిచాయని తెలుసుకున్నారు. [18] యెరూషలేము నుండి బేతనియకు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. [19] చాలామంది యూదులు మార్తను మరియను వారి సహోదరుని గురించి ఓదార్చడానికి వచ్చారు. [20] మార్త యేసు వస్తున్నారని విని ఆమె ఆయనను ఎదుర్కోడానికి బయటకు వెళ్లింది కాని మరియ ఇంట్లోనే ఉండిపోయింది. [21] మార్త యేసుతో, “ప్రభువా, నీవిక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. [22] ఇప్పుడైనా నీవు దేవుని ఏమి అడిగినా అది నీకు ఇస్తాడని నాకు తెలుసు” అన్నది. [23] యేసు ఆమెతో, “నీ సహోదరుడు మరల లేస్తాడు” అని చెప్పారు. [24] అందుకు మార్త, “చివరి రోజున పునరుత్ధానంలో అతడు తిరిగి లేస్తాడని నాకు తెలుసు” అన్నది. [25] యేసు, “పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవారు చనిపోయినా మళ్ళీ బ్రతుకుతారు. [26] బ్రతికి ఉండి నన్ను నమ్మినవారు ఎప్పుడూ చనిపోరు. నీవు ఇది నమ్ముతున్నావా?” అని ఆమెను అడిగారు. [27] ఆమె, “అవును ప్రభువా, నీవు ఈ లోకానికి రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముతున్నాను” అని ఆయనతో చెప్పింది. [28] ఆమె ఈ మాట చెప్పిన తర్వాత, ఆమె వెనుకకు తిరిగివెళ్లి ఎవరికి తెలియకుండా తన సహోదరియైన మరియను ప్రక్కకు పిలిచి, “బోధకుడు ఇక్కడే ఉన్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అని చెప్పింది. [29] మరియ అది విని వెంటనే లేచి ఆయన దగ్గరకు వెళ్లింది. [30] అప్పటికి ఇంకా యేసు గ్రామం లోపలికి ప్రవేశించలేదు, మార్త తనను కలుసుకొన్న చోటే ఉన్నారు. [31] మరియను ఓదారుస్తూ ఇంట్లో ఉన్న యూదులు ఆమె త్వరగా లేచి బయటకు వెళ్లడం చూసి ఆమె ఏడ్వడానికి సమాధి దగ్గరకు వెళ్తుందని భావించి ఆమె వెంట వెళ్లారు. [32] మరియ యేసు ఉన్న చోటికి వెళ్లి యేసును చూసి ఆయన పాదాల మీద పడి, “ప్రభువా, నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు” అన్నది. [33] ఆమె ఏడ్వడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడుస్తూ ఉండడం యేసు చూసి, తన ఆత్మలో ఎంతో బాధతో మూలుగుతూ, [34] “మీరు అతన్ని ఎక్కడ పెట్టారు?” అని వారిని అడిగారు. అప్పుడు వారు, “ప్రభువా, వచ్చి చూడండి” అని అన్నారు. [35] యేసు ఏడ్చారు. [36] అప్పుడు యూదులు, “చూడండి ఆయన అతన్ని ఎంత ప్రేమించాడో!” అని అన్నారు. [37] అయితే వారిలో కొందరు, “గ్రుడ్డివాడి కళ్లను తెరిచిన ఈయన, ఇతనికి చావు రాకుండా చేయలేదా పోయాడా?” అన్నారు. [38] యేసు తనలో తాను మరొకసారి మూలుగుతూ సమాధి దగ్గరకు వచ్చారు. ఆ సమాధి ముందు ఒక రాయి అడ్డుగా పెట్టబడి ఉంది. [39] యేసు, “ఈ రాయిని తీసి వేయండి” అన్నారు. చనిపోయిన లాజరు సహోదరియైన మార్త, “ప్రభువా, అతన్ని అందులో పెట్టి నాలుగు రోజులైంది, ఈపాటికి దుర్వాసన వస్తూ ఉంటుంది” అన్నది. [40] అప్పుడు యేసు, “నీవు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా?” అన్నారు. [41] కాబట్టి వారు రాయిని ప్రక్కకు తొలగించారు. అప్పుడు యేసు తల పైకెత్తి చూస్తూ, “తండ్రీ, నీవు నా విన్నపాలను విన్నందుకు నీకు కృతఙ్ఞతలు చెల్లిస్తున్నాను. [42] నీవు ఎల్లప్పుడు నా విన్నపాలను వింటావని నాకు తెలుసు. అయితే ఇక్కడ నిలబడిన ప్రజలు నీవు నన్ను పంపించావని నమ్మాలని ఈ మాటను పలికాను” అన్నారు. [43] యేసు ఈ మాట చెప్పిన తర్వాత బిగ్గరగా, “లాజరూ, బయటకు రా!” అని పిలిచారు. [44] చనిపోయిన లాజరు బయటకు వచ్చినప్పుడు, అతని కాళ్లు చేతులు నారవస్త్రంతో కట్టి ఉన్నాయి, అతని ముఖం ఒక గుడ్డతో చుట్టబడి ఉంది. అప్పుడు యేసు వారితో, “సమాధి బట్టలను తీసివేసి అతన్ని వెళ్లనివ్వండి” అన్నారు. [45] మరియను చూడటానికి వచ్చిన యూదులలో చాలామంది యేసు చేసిన కార్యాలను చూసి ఆయనను నమ్మారు. [46] అయితే వారిలో కొందరు పరిసయ్యుల దగ్గరకు వెళ్లి వారికి యేసు చేసిన కార్యాలను చెప్పారు. [47] అప్పుడు ముఖ్య యాజకులు పరిసయ్యులు న్యాయసభను ఏర్పాటు చేశారు. “మనం ఏమి చేద్దాం? ఈయన అనేక అద్భుత కార్యాలను చేస్తున్నాడు. [48] మనం ఆయనను ఇలాగే వదిలేస్తే, ప్రతి ఒక్కరు ఆయనను నమ్ముతారు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలాన్ని, మన దేశ ప్రజలను తీసుకుపోతారు” అన్నారు. [49] అప్పుడు వారిలో ఆ సంవత్సరపు ప్రధాన యాజకుడైన కయప మాట్లాడుతూ, “మీకు ఏమి తెలియదు! [50] ప్రజలందరు నశించిపోకుండా వారి కోసం ఒక మనుష్యుడు చనిపోవడం మంచిదని మీరు గ్రహించడంలేదు” అన్నాడు. [51] అతడు తనంతట తానే ఈ విధంగా చెప్పలేదు కాని, ఆ సంవత్సరపు ప్రధాన యాజకునిగా అతడు యేసు యూదా దేశమంతటి కోసం చనిపోతాడని, [52] ఆ దేశం కోసం మాత్రమే కాకుండా చెదిరిపోయిన దేవుని పిల్లలందరిని ఒక్క చోటికి చేర్చి వారందరిని ఒకటిగా సమకూర్చుతాడని ప్రవచించాడు. [53] కాబట్టి ఆ రోజు నుండి వారు యేసును చంపడానికి ఆలోచన చేస్తున్నారు. [54] కాబట్టి యేసు అప్పటినుండి యూదుల మధ్య బహిరంగంగా తిరగలేదు. కానీ అక్కడి అరణ్య ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఎఫ్రాయిం అనే గ్రామంలో తన శిష్యులతో ఉన్నారు. [55] యూదుల పస్కా పండుగ దగ్గర పడుతుందని, చాలామంది తమ శుద్ధీకరణ ఆచార ప్రకారం పస్కాకు ముందుగానే గ్రామాల నుండి బయలుదేరి యెరూషలేముకు వెళ్లారు. [56] వారు యేసు కోసం వెదకుతూ దేవాలయ ఆవరణంలో నిలబడి ఒకరితో ఒకరు, “మీరేమంటారు? ఆయన పండుగకు రావట్లేదేమో!” అని చెప్పుకుంటున్నారు. [57] యేసు ఎక్కడ ఉన్నాడనే సంగతి ఎవరికైనా తెలిస్తే, వారు ఆయనను పట్టుకోవడానికి తమకు తెలియచేయాలని ముఖ్య యాజకులు పరిసయ్యులు ప్రజలకు ఆదేశించారు.
